అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన నిరుద్యోగ యువత డీఎస్సీ నోటిఫికేషన్‌కు డిమాండ్ చేస్తూ చేపట్టిన మన్యం బంద్ రెండో రోజూ కొనసాగింది. ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేయాలని, ఏజెన్సీలో ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.
బంద్‌లో భాగంగా మండల కేంద్రంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రోడ్డుపై ఆటోలు, బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజా సంఘాల నాయకులు, గిరిజన యువత పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నంబర్ 3 పునరుద్ధరించాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది. ఉద్యోగావకాశాలను గిరిజనులకే కేటాయించాలన్న డిమాండ్‌ను నిరసనకారులు స్పష్టం చేశారు.
పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన యువత, శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం మనసు మార్చి హామీ నెరవేర్చాలంటూ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని ప్రార్థించారు. ఈ ఆందోళనకు గిరిజన ప్రజానీకం పెద్దఎత్తున మద్దతు తెలిపింది.