పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో *” అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలిచ్చిన వారికి, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించాలని, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేని పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు మంజూరు చేయాలని, అర్హులైన వారికి వృద్ధాప్య, వికలాంగు, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్లు మంజూరు చేయాలని, గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుకను తక్షణమే విడుదల చేసి, నిర్మాణదారులకు, కార్మికులకు న్యాయం చేయాలని, ఉప్పాడ గ్రామాన్ని ఆనుకొని సముద్రతీర ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేయడం జరిగింది.ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గొడుగు సత్యనారాయణ, మహిళా సంఘం (ఐప్వా) జిల్లా అధ్యక్షురాలు శీలం అప్పలరాజు మాట్లాడుతూ మండల పరిధిలో గల కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ, కొత్తపల్లి, ఎండపల్లి, జొన్నలగరువు, వాకతిప్ప ఇతర గ్రామాలలో వున్న ప్రజలు ఒక్కొక్క ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు జీవిస్తూ, కొన్ని కుటుంబాలు అద్దె ఇళ్లల్లో నివసిస్తూ అద్దె చెల్లించుకోలేక, గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలలో ఆర్థిక స్తోమత లేక ఇళ్ళు నిర్మించుకోలేక, ఇళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వంలో నిబంధనల పేరుతో రెండు, మూడు కుటుంబాలు ఉంటే ఒక్కరికి మాత్రమే ఇళ్లస్థలం ఇవ్వడం జరిగిందని మిగిలిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, పట్టాలు ఇచ్చిన వారికి, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించి, ఆర్థిక స్తోమత లేని వారికి ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు లేకపోవడంతోను, జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారనీ తక్షణం వారికి కార్డులు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రకటించింది. కానీ ఇసుకను నిలుపుదల చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం వలన నిర్మాణాలు ఆగిపోయి నిర్మాణదారులు భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 18 సంవత్సరాల దాటిన ప్రతీ మహిళకు నెలకు 1500/- రూ.లు చొప్పున ఏకౌంట్లలో జమ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, ఉద్యోగాలు వచ్చేవరకు నెలకు 5000/- రూ.లు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని సూపర్ సిక్స్ లాంటి హామీలను ఇవ్వడం జరిగిందని కానీ అవి ఇప్పటికీ అమలు కాలేదని వారి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ తో పాటు విద్య– వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాలని, కార్మికులందరికీ ఉచిత భీమా సౌకర్యం కల్పించాలని, స్కీమ్ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్నటువంటి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ పీపుల్స్ సిక్స్ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం కల్పించిన ప్రజా హక్కులను, ప్రజా సమస్యలను సాధించుకోవడానికి 2024 డిసెంబర్ 4న విజయవాడలో జరుగు ప్రజా హక్కుల బహిరంగ సభ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం పై డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దారి కి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు రాజేష్, సోని, మహాలక్ష్మి , భవాని, లక్ష్మి, అయార్ల సభ్యులు రమణ, పేతురు, సుబ్బారావు, అప్పారావు, ఏఐసిసిటుయు సభ్యులు నాగబాబు లోవరాజు, వెంకటరమణ, చిన్న బాబు, వెంకటేష్, వినోద్, సురేష్ తదితరులు, కోనపాప పేట, ఉప్పాడ, కొత్తపల్లి, ఎండపల్లి, జొన్నలగరువు, వాకతిప్ప తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.