సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘SSMB 29’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఆమె, రాజమౌళి, కీరవాణి లతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. దీనితో ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమేనని కన్ఫర్మ్ అయినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియాంక ఈ సినిమాలో నటించేందుకు భారీ పారితోషికం తీసుకుంటుందట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె ఈ సినిమాకు ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతోందట. భారతీయ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ తర్వాత ఆమె తీసుకునే ఇదే అత్యధిక పారితోషికం కావొచ్చని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ‘SSMB 29’ మూవీ పూజా కార్యక్రమాలు ఎలాంటి హడావుడి లేకుండా ఈనెల ప్రారంభంలోనే పూర్తి చేసేశారు. ఇక చిత్రబృందం ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, కెన్యా అడవుల్లో, మరికొన్ని ముఖ్యమైన లొకేషన్లలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోందని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మరి, ప్రియాంక పాత్ర గురించి, ఆమె రెమ్యూనరేషన్‌పై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి!