విశాఖలో లులూ గ్రూప్‌కు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమ ముందుంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. ముఖ్య న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
పాకా సత్యనారాయణ అనే వ్యక్తి ఈ కేటాయింపును వ్యతిరేకిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లులూ గ్రూప్‌కు బిడ్డింగ్ ప్రక్రియ లేకుండానే, సంస్థ ప్రతిపాదనల మేరకు 13.5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొస్తోందని ఆయన ఆరోపించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదిస్తూ, భూమి కేటాయింపు ఇంకా పరిశీలన దశలో ఉందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి, రెవెన్యూ శాఖ తరఫున కేఎం కృష్ణారెడ్డి హాజరై, ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలియజేశారు. ఇదంతా లులూ గ్రూప్ చైర్మన్ ప్రతిపాదనల ఆధారంగా మాత్రమే ఉందని పేర్కొన్నారు.
ఈ అంశంపై తుది నిర్ణయాన్ని హైకోర్టు వేసవి సెలవుల తర్వాత తీసుకోనుంది. అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటాయింపు ప్రక్రియపై పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూముల కేటాయింపులో పారదర్శకత, న్యాయసమ్మతత వంటి అంశాలపై ఈ విచారణ ప్రభావం చూపవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.