రాజకీయ నాయకులకు పెన్షన్ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయం ఒక ఉద్యోగం కాదు, ఇది సేవ మాత్రమే కనుక ఎంపీలకు పెన్షన్ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న ఎంపీలకు జీవితాంతం పెన్షన్ వస్తోంది. దీనిని తక్షణమే రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
ఇప్పుడు ఉన్న విధానంలో ఒకే వ్యక్తి కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీగా కొనసాగితే మూడు పెన్షన్లు పొందే అవకాశం ఉంది. ఇది ప్రజాధనానికి భారమవుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరాలుగా పనిచేసినా పరిమిత పెన్షన్ పొందుతుంటే, ప్రజా సేవకులైన నాయకులకు ప్రత్యేక పెన్షన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఎంపీల జీతభత్యాలను కేంద్ర పే కమిషన్ ఆధారంగా నిర్ణయించాలని, వాటిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, వారికి లభించే ఉచిత ప్రయాణం, ఆరోగ్య సేవలు, క్యాంటీన్ సబ్సిడీలు రద్దు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా నాయకులు, సామాన్యుల మాదిరిగానే ప్రభుత్వ సేవలను పొందాలని సూచిస్తున్నారు.
ఇది రాజకీయాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఒక కీలక ముందడుగు. ప్రజలు దీనికి మద్దతుగా నిలవాలని పిటిషన్ దాఖలు చేసిన నేతలు కోరుతున్నారు. సామాన్య పౌరులపైనే పన్నుల భారం పడుతుంటే, ప్రజా ప్రతినిధులు ఎందుకు ప్రత్యేక ప్రయోజనాలు పొందాలని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చ దేశవ్యాప్తంగా పెద్ద ప్రచారంగా మారుతోంది.