వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని ఎరుకలవాడలో నెమలి మాంసం విక్రయిస్తోన్నారంటూ తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఓ వ్యక్తి నెమలి మాంసాన్ని విక్రయిస్తున్నాడన్న సమాచారం ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులకు అందించాడు.
ఆ వెంటనే వేములపల్లి పోలీసులు, ఆటవిశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పదంగా ఉన్న మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మాంసం విక్రయించిన వ్యక్తి అది నెమలి కాదు, నీటి కోడి అని చెప్పడంతో ఇది నిజంగా జాతీయ పక్షి నెమలా? లేదా నీటికోడా? అన్న అనుమానంతో అధికారులు దాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెమలి మాంసం విక్రయించారన్న ఆరోపణ నిజమైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. పక్షి జాతి నిర్ధారణపై అధికారుల తుది నివేదిక రావాల్సి ఉందని సమాచారం.