హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గన్నవరం విమానాశ్రయంలో భారీ స్థాయిలో జనసేన కార్యకర్తలు ఆయనను కలుసుకొని నినాదాలు చేశారు. పార్టీ జెండాలతో, కారు ర్యాలీలతో హర్షధ్వానాలు చేస్తూ పవన్‌కి మద్దతు తెలిపారు.
గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో మంగళగిరికి బయలుదేరిన పవన్ కల్యాణ్, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్ల గురించి సమీక్షించారు. మంగళగిరిలో అభిమానులు భారీగా చేరుకొని ఆయనకు అభివాదం చేశారు.
అనంతరం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన పవన్ కల్యాణ్, పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు చేరుకుంటారు. ఈ సభ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో, లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు.
పవన్ కల్యాణ్ ఈ సభలో పార్టీ భవిష్యత్తు దిశ, పాలనలో జనసేన పాత్ర, రాష్ట్రానికి పార్టీ తీసుకురాబోయే మార్పులపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జనసేన నాయకత్వం ఈ సభను చారిత్రకంగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.