డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు. దాడి వివరాలను జవహర్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుండి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ‘నేనున్నా, ధైర్యంగా ఉండండి’ అని వారికి భరోసా కల్పించారు.
మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీడీవోపై దాడి అధికారులపై దాడులతో సమానమని, దీనిని సహించబోమని చెప్పారు. ఎంపీడీవో లాంటి కీలక అధికారిపై ఈ దారుణం జరగడం వైసీపీ అనవసర అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
ఇలాంటి దాడులు చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని, సుదర్శన్ రెడ్డి గతంలో కూడా అధికారులపై దాడి చేసిన చరిత్ర కలిగినవాడని పవన్ వివరించారు. అహంకారంతో చేసే దాడులు ఆపకపోతే సీరియస్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను ప్రభుత్వ వ్యవస్థపై దాడిగా పరిగణించాలని ఆయన అన్నారు.
మండల స్థాయి అధికారిపై కులం పేరుతో దూషణలు, దాడులు అనవసరంగా పెరిగిపోతున్నాయని పవన్ మండిపడ్డారు. బాధితుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. పులివెందుల రైతు ఆత్మహత్య ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు.
