ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బల్లగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రజలకు తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం వల్లే తాను ఈ సేవలు అందజేయగలుగుతున్నానని పవన్ అన్నారు.
“మాకు 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఈ విజయమే ప్రజలకు మేలుచేసే అవకాశాన్ని కల్పించింది” అని తెలిపారు. అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాలు 4,500 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తాయని పేర్కొన్నారు.
పాత్రికేయుల అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, “మాకు ఓట్లు వేయని ప్రజలకోసం కూడా మేము పనిచేస్తాం. ఓట్లు కాదు, సంక్షేమమే మా లక్ష్యం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు దీనికి నిదర్శనం” అని పవన్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఆయన పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన పనులను ప్రశంసించారు. అధికారంలో ఉండటం వల్ల ప్రజలకు సేవ చేయడం సాధ్యమవుతుందని చెప్పిన పవన్, భవిష్యత్‌లో మరింత సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.