పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వస్తువుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మే 2న కేంద్రం నుంచి వెలువడిన ఉత్తర్వుల ప్రకారం, పాకిస్థాన్ నుంచే కాకుండా, మూడో దేశాల మీదుగా వచ్చినా కూడా ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను పూర్తిగా నిరోధించాలని స్పష్టం చేసింది.
కానీ, ఈ నిషేధాన్ని మింగలేకపోయిన పాకిస్థాన్, అడ్డదారుల్లో తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి చొప్పించేందుకు వ్యూహాలు రచిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పండ్లు, ఎండు ఖర్జూరాలు, సైంధవ లవణం, వస్త్రాలు, తోలుబట్టలు తదితర ఉత్పత్తులను యూఏఈ, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో రీప్యాకేజింగ్ చేసి, వాటిపై కొత్త లేబుళ్లు వేసి భారత్‌కు పంపేందుకు యత్నిస్తోంది.
ఇలాంటి చర్యలపై భారత కస్టమ్స్ విభాగం ఇప్పటికే అప్రమత్తమైంది. పాకిస్థాన్ ఉత్పత్తులు మూడో దేశాల ద్వారా వస్తున్నా నిర్దేశించిన నిబంధనల మేరకు, ప్రతి ఒక్క కంటైనర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులైనా వాటిని నిలిపివేసి, మూల ప్రదేశం గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపై పాక్ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో చోటు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న దేశానికి భారత్ తన భద్రతా ప్రయోజనాల పరిరక్షణ కోసం స్పష్టమైన సంకేతం పంపుతోంది. ప్రజలు కూడా పాకిస్థాన్‌కు చెందిన ఉత్పత్తుల గురించి తెలుసుకుని వాటిని కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.