నోయిడాలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పని కోసం వచ్చిన వృద్ధుడిని అకారణంగా నిలబెట్టిన ఉద్యోగులపై నోయిడా సీఈవో డాక్టర్ లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఆయన అంగీకారం లేకుండా, 20 నిమిషాల పాటు నిలబడి పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించారు.
నోయిడా న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (NOIDA) వద్ద ప్రతి రోజు వందలాది వ్యక్తులు తమ పనుల కోసం ఆఫీసు చేరుకుంటారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేశ్ గతేడాది ఈ శాఖలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
సిబ్బంది పనితీరును పర్యవేక్షించడానికి సీఈవో కార్యాలయంలో 65 సీసీ కెమెరాలు పెట్టించారు. ఈ కెమెరాల ద్వారా ప్రతిరోజూ ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్నారు. సోమవారం, సీఈవో ఒక వృద్ధుడిని అకారణంగా నిలబెట్టిన దృశ్యాన్ని చూసి నేరుగా స్పందించారు.
వృద్ధుడు 20 నిమిషాల పాటు డెస్క్ ముందు నిలబడి ఉండటాన్ని చూసిన సీఈవో ఉద్యోగుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే, ఉద్యోగులకు శిక్ష విధించి నిలబడి పనిచేయమని ఆదేశించారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు సీఈవోకు అభినందనలు తెలుపుతున్నారు.