ఆక్టోబర్‌లో యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీలు కొత్త రికార్డును నమోదు చేశాయి. గడచిన నెలలో దేశవ్యాప్తంగా రూ. 23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరగడం ఇదే ప్రథమం. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో లావాదేవీల సంఖ్య 10 శాతం, విలువ పరంగా 14 శాతం పెరిగినట్లు ఎన్‌పీసీఐ వివరించింది.
అక్టోబర్‌లో యూపీఐ లావాదేవీలు రోజువారీగా 535 మిలియన్లకు చేరాయి, వీటి విలువ రూ. 75,801 కోట్లుగా నమోదైంది. ఐఎంపీఎస్ సేవలలో కూడా వృద్ధి చోటుచేసుకుంది. అక్టోబర్‌లో ఐఎంపీఎస్ లావాదేవీలు 467 మిలియన్లుగా ఉండగా, సెప్టెంబర్‌లో అవి 430 మిలియన్లు మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు కూడా 318 మిలియన్ల నుండి 345 మిలియన్లకు పెరిగి 8 శాతం వృద్ధిని సాధించాయి.
డిజిటల్ చెల్లింపుల ద్వారా దేశంలో నగదు వినియోగం మరింతగా తగ్గుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌పీసీఐ ప్రకారం, మార్చి 2021లో 14-19 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపుల వాటా, 2024 మార్చికి 40-48 శాతానికి చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్‌మెంట్ నివేదిక తెలిపింది.