ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వమైతే అభివృద్ధి వేగంగా జరుగుతుందని పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీలు కీలకంగా ఉండటంతో రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రహదారుల విస్తరణపై దృష్టి సారించింది.
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 42వ నంబర్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇప్పటివరకు రెండు వరుసలుగా ఉన్న రహదారి మార్పు చేయనున్నారు. దీనివల్ల కుప్పం-తమిళనాడు మధ్య ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది.
పలమనేరు నుంచి కుప్పం వరకు 42 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా మారుస్తారు. అలాగే కుప్పం నుండి తమిళనాడు సరిహద్దు వరకు మరో 20 కిలోమీటర్ల మార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 84 కిలోమీటర్ల పొడవునా రహదారి విస్తరించనున్నారు. ఐదు ప్రాంతాల్లో కొత్తగా బైపాస్ రోడ్లు ఏర్పడనున్నాయి.
దీంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు కూడా మేలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, బెంగళూరు-చెన్నై జాతీయ రహదారి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కొత్త రహదారి నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా మరింత మెరుగుపడనుంది.