అమరావతికి ప్రయాణించే వారికీ ఇది నిజంగా శుభవార్త. ఇప్పటివరకు విజయవాడ నగరంలోకి ప్రవేశించి, గంటల తరబడి ట్రాఫిక్‌లో కూరుకుపోయే బాధ అనివార్యం. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదన్న మాట. కృష్ణా నదిపై నిర్మించిన 3.11 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల భారీ వంతెన ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ద్వారా ట్రాఫిక్‌కు లోనవకుండా నేరుగా అమరావతికి చేరే అవకాశం లభిస్తోంది.
పశ్చిమ బైపాస్‌లో భాగంగా నిర్మించిన ఈ వంతెన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంలో ప్రారంభించబడింది. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ నగరాన్ని తాకకుండా అమరావతికి చేరడానికి ఇది ప్రధాన మార్గంగా మారింది. గొల్లపూడి వద్ద నుంచి ఈ వంతెనపైకి ఎక్కితే కేవలం ఐదు నిమిషాల్లోనే వెంకటపాలెం చేరుకోవచ్చు. అలాగే గన్నవరం వైపు నుంచి వచ్చే వారు చిన్న అవుటపల్లి వద్ద నుంచి బైపాస్ ఎక్కి విజయవాడ ట్రాఫిక్‌కు దూరంగా, అరగంటలోపే అమరావతిలోకి చేరవచ్చు.
ఈ వంతెన నిర్మాణం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు, నిర్మాణ సామగ్రి, భారీ వాహనాల రవాణాకు కూడా ఇది అనుకూలంగా మారింది. వంతెన ఇరువైపులా ఏర్పాటుచేసిన లైటింగ్ సదుపాయాలు, మార్గ నిర్దేశక బోర్డులు, డివైడర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చుతున్నాయి. నిర్మాణ దశలోనే అన్ని రకాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచి వంతెనను రూపుదిద్దారు.
ప్రయాణికులు, స్థానికులు ఈ వంతెనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగర ట్రాఫిక్‌ను ఎదుర్కొనకుండా నేరుగా అమరావతిలోని సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలకు చేరుకోవడం ఇప్పుడు మరింత సులభం అయింది. ఇది అమరావతి అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, ఈ మార్గం రాబోయే కాలంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.