భారత్‌తో ఇటీవల తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో, పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, తన సోదరుడు మరియు ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సమస్య పరిష్కారం కోసం దౌత్య మార్గాలను అనుసరించడమే ఉత్తమమని సూచించినట్లు సమాచారం. ఈ సలహా నవాజ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఇచ్చినట్లు తెలుస్తోంది.
“రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగినవి. అందుచేత, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అన్ని దౌత్య మార్గాలను వాడుకోవాలి” అని నవాజ్ షరీఫ్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ తరుణంలో సంయమనం పాటించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా తీసుకుని దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు, దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. భారత్ ఈ దాడిని తీవ్రంగా ఖండించిఅదేవిధంగా పాకిస్థాన్‌తో సంబంధాలను మరింత దిగజార్చే నిర్ణయాలు తీసుకుంది.
ఈ దాడికి బదులుగా, భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో, పాకిస్థాన్ పౌరులు తక్షణమే భారత్ విడిచిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ కూడా ఈ వివాదంలో సిమ్లా ఒప్పందంతో సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెట్టింది మరియు భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసిందని ప్రకటించింది.