ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహాయ సహకారాలు అందించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, తైవాన్ పరిశ్రమల ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ రంగాల్లో తైవాన్ అనుసరిస్తున్న విధానాలు, పాలసీలను అధ్యయనం చేయాలని లోకేష్ కోరారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక చర్యలు తీసుకుంటుందని లోకేష్ వివరించారు. 2014-19 కాలంలో తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ల ఏర్పాటుతో వచ్చిన ఉపాధి అవకాశాలను గుర్తు చేశారు. ప్రభుత్వం “స్పీడ్ ఆఫ్ డూయింగ్” విధానాన్ని అనుసరిస్తుందని, కొత్త పరిశ్రమలు సులభంగా స్థాపన చేసుకోవడానికి అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలను వేగంగా అందిస్తున్నామని తెలిపారు.
తైవాన్ పరిశ్రమలకు ఏపీ ఉత్తమ గమ్యస్థానమని నారా లోకేష్ పేర్కొన్నారు. తైవాన్‌కు చెందిన అనేక కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని, ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధితో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
తైవాన్ పరిశ్రమల ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ ప్రత్యేక పార్కుల ఏర్పాటు గురించి చర్చించారు. ఈ సమావేశంలో తైవాన్ బృందం, nexusindo consultancy MD ఎరిక్ చాంగ్, pou chen corporation ప్రతినిధి వెల్బర్ వ్యాంగ్, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.