ఎమ్మిగనూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక రైడ్లు చేపట్టారు. గురువారం వై.యస్.ఆర్. సర్కిల్ వద్ద గోకుల్ టిఫిన్ సెంటర్ లో జరిగిన తనిఖీలో ప్లాస్టిక్ వినియోగం పట్ల సీరియస్ గా స్పందించిన అధికారులు యజమానికి రూ.10,000 జరిమానా విధించారు.
మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోందని, ప్రజల ఆరోగ్యాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే వారి షాపులను సీజ్ చేస్తామన్నారు. దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగం ఆపాలని, ప్రజలు కూడా పర్యావరణానికి మేలుకోసం ప్లాస్టిక్ ని దూరం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.