తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనతో పేరుగాంచిన మోహన్ బాబు తన జీవిత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా అనుభవం ‘రాజమకుటం’ అని తెలిపారు. ఎవరికి చెప్పకుండా నాలుగు కిలోమీటర్లు నడిచే వెళ్లి సినిమా చూశానని చెప్పారు. నటుడిగా తొలి అవకాశం దాసరి నారాయణరావు ఇచ్చారని… 1975లో ‘స్వర్గం నరకం’ చిత్రం ద్వారా విలన్ గా రంగప్రవేశం చేశానని వివరించారు. అప్పటి నుంచి నటుడిగా తన ప్రయాణం కొనసాగుతూనే ఉందన్నారు.
తనకు ఎంతో గౌరవంగా అనిపించే విషయమై మోహన్ బాబు మాట్లాడారు. తన సొంత బ్యానర్‌ను అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. నిర్మాతగా తన మొదటి సినిమా ‘ప్రతిజ్ఞ’కు చంద్రబాబు మొదటి క్లాప్ కొట్టారని చెప్పారు. అదే బ్యానర్‌పై ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం నిర్మించానని, ఆ సినిమా కోసం తన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అన్నగారు వద్దు అన్నప్పటికీ సినిమా నిర్మించి విజయవంతం చేశానని చెప్పారు.
తాను కోరుకున్నవి అన్నీ సాధించానని మోహన్ బాబు గర్వంగా చెప్పారు. రాజకీయాలు తనకు సెట్ అవ్వలేదని అన్నారు. ప్రస్తుతం దేవుడి దయతో మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధమని చెప్పారు. ఇప్పటివరకు 560 సినిమాల్లో నటించానని తెలిపారు. తనకు ఆవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గతాన్ని తవ్వుకోవడం వల్ల ప్రయోజనం లేదని, అయితే చాలామంది తనను మోసం చేశారని, అప్పటి నుంచే ఆవేశం పెరిగిందని చెప్పారు.
పక్కవారు నష్టపోవాలని ఎప్పుడూ తాను కోరుకోనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లపై స్పందించిన ఆయన, అవి తనను ప్రభావితం చేయవని చెప్పారు. ట్రోలింగ్ వల్ల వారికి ఏం ఆనందం కలుగుతుందో తెలియదని వ్యాఖ్యానించారు. ‘కన్నప్ప’ సినిమాలో అవకాశం రావడం దేవుడి దయ అని పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులతో సినిమా పూర్తయిందని, ప్రేక్షకుల ప్రేమతో సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
