కాకుమాను మండలంలో పత్తిపాడు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు పాల్గొన్నారు. ఆలపాటి రాజా ప్రజలకు సేవ చేసే నాయకుడని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పత్తిపాడు నియోజకవర్గంలో ఆలపాటి రాజాకు పట్టభద్రుల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు.
గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఎమ్మెల్యే రామాంజనేయులు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
చదువుకున్న పట్టభద్రులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు ఆలపాటి రాజాకు మద్దతు తెలపాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగకుండా ఉండాలంటే ఆలపాటి రాజా గెలుపు కీలకమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు స్వయంగా ఓటర్లకు ఓటు స్లిప్‌లు అందజేశారు. ప్రజలు ఎన్నికలలో చురుకుగా పాల్గొని, ఆలపాటి రాజాకు తమ విలువైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆలపాటి రాజా అంకితభావంతో పనిచేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.