కాటారం మండలంలోని కొత్తపల్లి తండాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం రోజు పర్యటించారు. ఈ సందర్భంగా వాంకుడోతు సమ్మక్క అనే మహిళ ఇంట్లో మంత్రి భోజనం చేశారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యం తో తయారైన వంటకాలు ఆస్వాదించిన మంత్రి, దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ ఉత్తమమైన ఆహారం అందించాలని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇది పేదల జీవితాల్లో గుణాత్మక మార్పులకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
పేదల మౌలిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని మంత్రి వివరించారు. కుటుంబ సభ్యులతో ముకాముఖీగా మాట్లాడి, సన్నబియ్యం రుచి, నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. దొడ్డు బియ్యానికి సన్నబియ్యానికి తేడాలను వివరించారని, పేదలకు మరింత ఉత్తమ ఆహారం అందించడమే లక్ష్యమని అన్నారు.
సన్నబియ్యం సాగు చేసిన రైతులకు బస్తాకు రూ.500 బోనస్ చెల్లించబడిందని తెలిపారు. ఈ పథకం ప్రజల అవసరాలను తీర్చేలా ఉండాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.