రాయచోటి పట్టణంలోని శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 12 నూతన ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద పండితుల పూజలతో శ్రీకారం చుట్టారు. ఈ కొత్త బస్సుల్లో 3 సూపర్ డీలక్స్, 2 అల్ట్రా డీలక్స్, 5 ఎక్స్ప్రెస్, 2 పల్లెవెలుగు బస్సులు ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రధాన లక్ష్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని నూతన బస్సులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆర్టీసీ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిందని, నేడు క్రమంగా పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్లేలా సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 2000 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి తేవడమే లక్ష్యమని తెలిపారు. కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నైట్ అలవెన్స్ మంజూరు చేయడమే కాకుండా, వారి సమస్యలపై స్పందన కలిగిన ప్రభుత్వం ఇది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి డిపో మేనేజర్ ధనుంజయ, రీజనల్ మేనేజర్ రాము, ఇతర డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మంత్రి బస్సులో ఉన్న సదుపాయాలను పరిశీలించి ప్రయాణికుల సౌలభ్యం కోసం మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో రవాణా శాఖ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.