Sammakka Saralamma Jathara: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కోటికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా.
శాశ్వత అభివృద్ధిపై దృష్టి
ఇప్పటివరకు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమైన మేడారంలో, ఈసారి శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం”రూ.251 కోట్లతో” అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, అందులో వనదేవతల గద్దెల విస్తరణకు “రూ.101 కోట్లు” కేటాయించారు.
చారిత్రక నిర్మాణాల రూపకల్పన
గద్దెల ప్రాంగణాన్ని రాతితో బలంగా నిర్మిస్తూ, చారిత్రక కట్టడాల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాంగణం రూపుదిద్దుకుంటోంది. ప్రధాన స్వాగత తోరణంతో పాటు పలు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఒకే వరుసలోకి తీసుకొచ్చి భక్తులకు సులభ దర్శనం కల్పించనున్నారు.
శిలలపై ఆదివాసీ సంస్కృతి
కోయ వంశీయుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా శిలలపై విస్తృతంగా శిల్పకళా పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించిన తెల్ల రాళ్లపై నిపుణులైన శిల్పులు చెక్కుతున్న ఈ శిల్పకళా కృతుల్లో సుమారు “7,000 ప్రత్యేక చిహ్నాలు”, “750 మంది కోయ వంశీయుల జీవన విధానాన్ని ప్రతిబింబించే రూపాలు” దర్శనమివ్వనున్నాయి.
మంత్రుల పర్యవేక్షణ
డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, క్యూలైన్ షెడ్లు వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సురేఖలు అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
