పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు ‘మాట వినాలి’ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ పాట విశేషంగా పవన్ స్వయంగా ఆలపించనుండటం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. మేకర్స్ ఈ అప్డేట్ను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.
ఇతర చిత్రాల్లో ఇప్పటికే నాలుగు నుంచి ఐదు పాటలు పాడిన పవన్, చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో పాట పాడటంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో పాటలపై అంచనాలు భారీగా పెరిగాయి.
హరిహర వీరమల్లు చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా పవన్ నటజీవితంలో మరో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 28న హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాట విడుదలకు ముందు నుంచే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘మాట వినాలి’ సాంగ్ విడుదల తర్వాత, సినిమా ప్రమోషన్ మరింత వేగంగా కొనసాగుతుందని అనుకుంటున్నారు.