పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మనూ భాకర్ మరో ఘనత సాధించింది. ఆమెకు ప్రతిష్టాత్మకమైన బీబీసీ ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది. ఒలింపిక్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది.
ఈ అవార్డు కోసం క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పోటీ పడగా, భాకర్ ఈ అవార్డును అందుకోవడం విశేషం. 22 ఏళ్ల మనూ భాకర్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్, 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లలో మనూ భాకర్ కాంస్య పతకాలను సాధించింది. ఈ విజయాలతో ఆమె భారత షూటింగ్ చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించింది. ఒలింపిక్స్‌లో మనూ భాకర్ ప్రదర్శన భారత క్రీడా ప్రపంచాన్ని గర్వపడేలా చేసింది.
ఈ ఏడాది భారత ప్రభుత్వం మనూ భాకర్‌ను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. తన అద్భుత ప్రదర్శనతో ఆమె క్రీడారంగంలో మరో మైలురాయిని చేరుకుంది. భాకర్ విజయాలు యువ షూటర్లకు ప్రేరణగా నిలుస్తున్నాయి.