విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాధ రెవెన్యూ పరిధిలోని రాజుపేట గ్రామంలో అర్థరాత్రి ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. మనుషుల మధ్య కక్షల కారణంగా నరికివేతలు జరిగే ఘటనలు చూస్తున్నా, ఇప్పుడు ఓ రైతు 12 ఏళ్లుగా పెంచిన మామిడి తోటనే దుండగులు నరికివేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మామిడి తోట యజమాని జిన్నాం గ్రామానికి చెందిన రాము నాయుడు ఉదయం తోటకు వెళ్లి చూశాక ఆ ఘటన బయటపడింది.
అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి చొరబడి అందులోని పెద్దపెద్ద మామిడి చెట్లను నరికి పడేశారు. సుమారు 12 ఏళ్లుగా శ్రమించి పెంచిన తోటను ఇలా నాశనం చేయడంపై బాధిత రైతు తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తోట నుంచి ఆదాయం అందుకునే దశలో ఇలా చెట్లను నరికేయడం వల్ల తనకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల కష్టం ఒకేసారి ఇలా నాశనమవ్వడం బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామస్థులు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ చర్యలు ఏ కారణంతో జరిగాయనే విషయాన్ని తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామస్థులు, బాధిత రైతు పోలీసులకు సహకరిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.