Betting Apps Case: నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీ నటి మంచు లక్ష్మి సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఏ అంశాలపై విచారణ?
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో మంచు లక్ష్మి పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. ఆయా యాప్‌ల ప్రమోషన్‌కు ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమిషన్ల రూపంలో ఎంత మొత్తం పొందారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
పాత కేసే అయినా… తాజా విచారణ
ఈ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం తాజాగా మొదలైనది కాదు. గతంలో ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మంచు లక్ష్మిని విచారించింది. అప్పట్లో ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
ఇతర ప్రముఖుల విచారణ
ఈ కేసులో మంచు లక్ష్మి మాత్రమే కాకుండా, గతంలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వంటి సినీ ప్రముఖులు కూడా విచారణకు హాజరయ్యారు. నిషేధిత యాప్‌ల ప్రచారంలో సెలబ్రిటీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతుండగా, ఈ వ్యవహారంపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
ALSO READ:Assam Violence | వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్‌లో ఉద్రిక్తతలు.. పోలీసు కాల్పులు, నలుగురికి గాయాలు
