సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ హైవే ప్రాజెక్ట్ ద్వారా పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే, హైవే పనుల్లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైవే నిర్మాణంలో భాగంగా మలక వేముల గ్రామానికి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జ్ సరైన ఎత్తు, వెడల్పుతో లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇది గ్రామానికి వచ్చే అంబులెన్స్, స్కూల్ బస్సుల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారింది. హైవే పనుల వల్ల గ్రామానికి రాకపోకలు కష్టతరమవడంతో ప్రజలు తమ సమస్యను అధికారులకు తెలియజేశారు.
అయితే, వారి సమస్యపై స్పందన లేకపోవడంతో గ్రామస్తులు నిరసనకు దిగారు. హైవే పనులను తాత్కాలికంగా నిలిపివేసి, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. వారు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి బ్రిడ్జ్ మార్పులను చేపట్టాలని డిమాండ్ చేశారు.
గ్రామస్థుల ఆందోళనకు సంబంధించి అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాలేదు. సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి త్వరలోనే హైవే పనులపై ఓ పరిష్కారాన్ని కనుగొనే అవకాశం ఉంది.