అమెరికాలోని షికాగో మిడ్ వే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ విమానం ల్యాండవుతున్న సమయంలో రన్‌వేపైకి మరో ప్రైవేట్ జెట్ అడ్డంగా రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం 8:47 గంటలకు షికాగో విమానాశ్రయంలో ల్యాండవుతోంది. రన్‌వే 31సీపై దిగుతుండగా, ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అనుమతి లేకుండా రన్‌వేపైకి ప్రవేశించింది. పైలట్ చివరి క్షణంలో అప్రమత్తమై టేకాఫ్ చేయడంతో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం రెండో ప్రయత్నంలో క్షేమంగా ల్యాండయింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. ప్రైవేట్ జెట్ పైలట్ ఎలాంటి అనుమతి లేకుండా రన్‌వేపైకి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇంటర్నెట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అధికారులు పూర్తి దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పైలట్ల సమయస్ఫూర్తితో ఓ భారీ విమాన ప్రమాదం తప్పిన ఘటనగా ఇది నిలిచింది.