శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ అధునాతన తయారీ యూనిట్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని, ఇది కేవలం నిర్మాణ కార్యక్రమం కాకుండా ఆవిష్కరణ, అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఏపీని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ యూనిట్ ఒక కీలకమైన ముందడుగని చెప్పారు.
రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి 1,500 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కలుగనున్నాయి. అదనంగా కీలక భాగస్వాములైన కంపెనీలు రూ.839 కోట్ల మేర పెట్టుబడి పెట్టి మరో 690 మందికి ఉపాధిని కల్పించనున్నాయి. ఇది స్థానిక యువతకు నూతన అవకాశాలను తీసుకురావడమే కాకుండా, రాష్ట్ర ఆర్థికతపై గణనీయ ప్రభావాన్ని చూపనుంది.
ఈ ఫ్యాక్టరీలో స్మార్ట్ ఫీచర్లు కలిగిన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి గృహోపకరణాలు తయారు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, AI ఆధారిత ఉత్పత్తి విధానాలతో రాష్ట్రంలో తయారీ రంగంలో నూతన దశను మొదలుపెట్టనున్నారు. “మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్” దిశగా ప్రయాణమిది అని మంత్రి వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో కొరియా రాయబారి లీ సియాంగ్ హూ, ఎల్‌జీ మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, పలువురు మంత్రులు, పారిశ్రామిక మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తగిన మౌలిక సదుపాయాలతోపాటు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ, స్మార్ట్ సిటీ మాదిరిగా LG సిటీ అభివృద్ధికి అన్ని విధాలా మద్దతునిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.