రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 40, 41 డివిజన్లలో ఆయన స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. అలాగే కోటిలింగాల ఘాట్ను పరిశీలించారు. కోటలింగాల ఘాట్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపధ్యంలో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సుమారు 800 మీటర్ల ఘాట్ను నిర్మిచడం జరిగిందన్నారు. రానున్న పుష్కరాల నేపధ్యంలో రాజమండ్రి నగరాన్ని ప్రజల అభిరుచులకు తగ్గట్టు అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ఉమా కోలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోటిలింగాల ఘాట్ను పుష్కరాలకు వచ్చే భక్తుల తాడికి అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. కోటిలింగాల ఘాట్లో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 40, 41 డివిజన్లలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించాలని అధికారులకు సూచించారు. స్థానిక కూటమి నాయకులు, కార్యరక్తలు, అభిమానులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు.
కోటిలింగాల ఘాట్ను పుష్కరాల కోసం అందంగా తీర్చిదిద్దాలి
