తెలంగాణలో కింగ్ ఫిషర్ బీరు సరఫరా పునరుద్ధరణపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీరు సరఫరాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
సరఫరా సమస్యలపై ప్రభుత్వ అధికారులతో యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ వరుస సమావేశాలు నిర్వహించింది. విరామం అనంతరం, తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి హామీ లభించడంతో సరఫరాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారులు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలికంగా సరఫరా మొదలు పెడుతున్నట్లు తెలిపింది.
సెబీ నిబంధనలకు అనుగుణంగా బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు యునైటెడ్ బ్రూవరీస్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో సరఫరా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో సరఫరాలో అంతరాయం ఉండదని తెలిపింది.
బీర్ల సరఫరా నిలిపివేత వల్ల కొన్నిరోజులుగా మార్కెట్‌లో కొరత ఏర్పడింది. ఇప్పుడు సరఫరా తిరిగి ప్రారంభమవడంతో వ్యాపారులు, వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వ చర్చల తర్వాత కింగ్ ఫిషర్‌తో పాటు మరిన్ని బ్రాండ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.