ఉత్తర కొరియా భద్రతకు ముప్పుగా మారే చర్యలను తాము సహించబోమని, అమెరికా కవ్వింపులకు తగిన బదులు ఇస్తామని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా ఇటీవల చేపట్టిన యుద్ధ విన్యాసాలు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తమ భూభాగానికి సమీపంలో యుద్ధ విన్యాసాలు చేయడం మితిమీరిన చర్యగా అభివర్ణించారు.
అమెరికా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో తన అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపిన విషయం కిమ్ ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తమ భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఈ చర్య ఉందని ఉత్తర కొరియా రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా తన బలాన్ని గుడ్డిగా నమ్ముకుంటోందని, తమను కదిలిస్తే భీకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఉత్తర కొరియా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించగా, అమెరికా మాత్రం బుసాన్ పోర్టులో సబ్ మెరైన్ నిలిపిన విషయాన్ని సాధారణ ప్రక్రియగా సమర్ధించుకుంది. సిబ్బందికి నిత్యావసరాలను అందించేందుకే యూఎస్‌ఎస్ అలెగ్జాండ్రియాను అక్కడ నిలిపినట్లు దక్షిణ కొరియా పేర్కొంది. ఉత్తర కొరియా చేస్తున్న ఆరోపణలతో తమకు ఎటువంటి సంబంధం లేదని దక్షిణ కొరియా తేల్చి చెప్పింది.
అయితే, ఉత్తర కొరియా చేసిన హెచ్చరికలపై అమెరికా ఇంకా స్పందించలేదు. కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్‌ను తేలిగ్గా తీసుకుంటే పరిస్థితి మరింత గంభీరంగా మారొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొరియా ద్వీపకల్పంలో సైనిక ఘర్షణ తప్పదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.