కర్ణాటకలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి తిరిగొచ్చిన అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 17న మంగళూరుకు చేరుకున్న అతనికి దద్దుర్లు రావడంతోపాటు స్వల్పంగా జ్వరం కూడా వచ్చింది.
ఆరోగ్య సమస్యలు పెరుగుతుండడంతో ఆసుపత్రికి వెళ్లిన అతనిపై వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. నమూనాలను పరీక్ష కోసం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. పరీక్ష ఫలితాల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.
కేసు నిర్ధారణ అనంతరం ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితుడిని పూర్తిగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులను పరీక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది.
కర్ణాటకలో మంకీపాక్స్ కేసు నమోదుకావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.