జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియనుండటంతో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీలైన కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మధ్యే పోటీగా ఉంటాయని అంచనా.
తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఫలితాల్లో కొంత భిన్నత్వం కనిపించే అవకాశం ఉంది. తుది ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోరు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే జరిగింది.
ఈ ముగ్గురి భవిష్యత్తును నిర్ణయించేది 4 లక్షలకు పైగా ఓటర్లే. ఇక జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉండటం ప్రత్యేకత. 2023 ఎన్నికల్లో 47.58% పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ 47.16% శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు.
తక్కువ పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందన్న అంశంపై విశ్లేషకుల దృష్టి ఉంది. సాధారణంగా తక్కువ పోలింగ్ అధికార వ్యతిరేక వాతావరణానికి సంకేతమని ఒక వాదన ఉండగా, మరోవైపు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకి ఈ పరిస్థితి లాభిస్తుందని కొందరు భావిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎవరికీ ఊరటనిస్తాయో, ఎవరికీ ఆందోళన కలిగిస్తాయో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫలితాలపై రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
