ఖమ్మం జిల్లా వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై తహసిల్దార్ రాజు దురుసుగా ప్రవర్తిస్తూ, తన క్యాబిన్ నుండి వెళ్లగొట్టి, అరెస్టు చేయిస్తా అని బెదిరించిన ఘటనపై రిపోర్టర్స్ తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రిలే నిరహార దీక్షలు దిగారు.
వేంసురు మండలం, ఎర్రగుంటపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు అనుమతులకు మించి మట్టి తోలకాలు జరుపుతున్న క్రమంలో మట్టి తోలకాల వివరాలు తెలుసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళిన రిపోర్టర్స్ ను తన అటెండర్ తో లోపలికి పిలిపించిన, ఎమ్మార్వో రాజు బెదిరించే ప్రయత్నం చేశారు. అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాల్సిన ఎమ్మార్వో… సంబంధం లేకుండా ఒక్కసారిగా రిపోర్టర్స్ పై కేకలు వేస్తూ, వారి అక్రిడేషన్లు లాక్కొని, ఫోన్లను లాక్కునే ప్రయత్నం చేస్తూ, పోలీసులు పిలిపించండి అరెస్టు చేయించుదామంటూ కింది సిబ్బందికి ఆర్డర్స్ వేశారు. ఎమ్మార్వో రాజు ప్రవర్తనను నిరసి స్తూ రిపోర్టర్స్ ఎమ్మార్వో కార్యాలయం ముందు టెంట్ వేసి రిలే నిరహార దీక్షలకుదిగారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ లు మాట్లాడుతూ… జర్నలిస్టులపై తహసిల్దార్ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే జర్నలిస్టులపై… బాధ్యులుగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా నిరంకుషత్వంగా ప్రవర్తించడం మీడియా స్వేచ్ఛను హరించటమేనని అన్నారు. మీడియా పైనే కాకుండా, తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల, తోటి ఉద్యోగుల పైన తహసిల్దార్ పద్ధతి మార్చుకోవటం లేదంటూ ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం వేంసూరు పోలీస్ స్టేషన్లో తహసిల్దార్ రాజు పై ఫిర్యాదు చేసారు. విషయం తెలుసుకున్న కల్లూరు ఆర్డీవో జర్నలిస్టులు చేస్తున్న నిరసన దీక్ష వివరాలను కలెక్టర్ కి అందజేసి, పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత జర్నలిస్టులు దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు వారి మద్దతు తెలిపారు.