టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో భారీ షాక్ ఇచ్చింది. ఇటీవలే రూ. 189, రూ. 479 ప్లాన్లను తొలగించిన జియో.. ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల గడువును కేవలం ఏడు రోజులుగా నిర్ణయించింది. గతంలో ఈ ప్లాన్లు బేస్ ప్లాన్‌కు అనుగుణంగా పనిచేసేవి. కానీ ఇప్పుడు వారం రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని శుక్రవారం తన అధికారిక వెబ్‌సైట్‌లో జియో ప్రకటించింది.
ఈ మార్పుల ప్రకారం, రూ. 69 ప్లాన్‌తో 6జీబీ డేటా లభిస్తే, రూ. 139 ప్లాన్‌తో 12జీబీ డేటా వస్తుంది. కానీ ఈ డేటాను వాడుకోవాల్సిన గడువు కేవలం 7 రోజులు మాత్రమే. జియో తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులను నిరాశకు గురి చేసింది. ఇప్పటికే డేటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్లాన్‌ల గడువు తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ట్రాయ్ ఆదేశాల మేరకు జియో కొత్తగా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ. 458 ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో అపరిమిత ఉచిత కాల్స్, 1,000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అయితే ఇందులో మొబైల్ డేటా ఉండదు. అదేవిధంగా రూ. 1,958 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో అపరిమిత ఉచిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లలో కూడా జియో సినిమా, జియో టీవీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అయితే డేటా అందించకపోవడంతో వినియోగదారులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. డేటా ప్లాన్‌ల వ్యాలిడిటీ తగ్గించిన జియో తాజా నిర్ణయం వినియోగదారులపై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.