అరేబియా సముద్రంలో భారత కోస్ట్ గార్డ్ ఓ సాహసోపేతమైన చర్యను చేపట్టింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక, భారత మత్స్యకారుల బోటుపై దాడి చేసి ఏడుగురు మత్స్యకారులను బంధించడంతో, భారత కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. దాదాపు రెండు గంటల పాటు ఆ నౌకను వెంబడించి, మత్స్యకారులను సురక్షితంగా విడిపించింది.
కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల బోటును పాక్ నౌక అడ్డగించింది. దాడి చేసి బోటును ముంచేసిన పాక్ అధికారులు, మత్స్యకారులను తమ నౌకలోకి ఎత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో భయాందోళనకు గురైన మత్స్యకారులు కోస్ట్ గార్డ్ ను సంప్రదించారు.
సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ అధికారి బృందం వెంటనే రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. భారత్-పాక్ సముద్ర సరిహద్దుల వద్ద పాక్ నౌకను అడ్డుకుని, చాకచక్యంగా చర్యలు చేపట్టి భారత మత్స్యకారులను విడిపించింది. ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కోస్ట్ గార్డ్ బృందం ప్రశంసలు అందుకుంది.
ఈ ఘటన మరోసారి భారత కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చడంతో, బాధిత కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. సముద్ర మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఘటన కీలక మైలురాయిగా నిలుస్తుందని మత్స్యకార సంఘాలు పేర్కొన్నాయి.