ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాకిస్థాన్‌ను తీవ్రంగా నిలదీసింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, వాటికి శిక్షణ, నిధులు సమకూర్చడం వంటి విషయాలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించిన విషయాన్ని భారత్ బలంగా ప్రస్తావించింది. పాక్ ఈ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ మండిపడింది.
భారత డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్ యోజన పటేల్ మాట్లాడుతూ, “ఐరాస వేదికను ఉపయోగించి భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడం పాకిస్థాన్ యొక్క బాధ్యతారాహిత్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. పాక్ మంత్రి చేసిన ఒప్పుకోలు ఉగ్రవాదానికి పాక్ ప్రోత్సాహాన్ని ధృవీకరిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రపంచాన్ని అస్థిరపరుస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా పాక్ మారిందని, ఇది ఇక అంతర్జాతీయంగా ప్రశ్నించబడాల్సిన విషయమని యోజన పటేల్ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచం నుంచి వచ్చిన మద్దతు భారత్‌కి విశేషంగా అనుకూలంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘీభావం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌కి నిదర్శనమని తెలిపారు.
ముంబై దాడులకు తర్వాత అత్యధిక ప్రాణ నష్టాన్ని కలిగించిన దాడి పహల్గామ్‌లో జరగడం ద్వారా పాక్ ఉగ్ర మద్దతు మరోసారి బహిరంగమైందని ఆమె అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని, భద్రతా మండలి తీర్మానాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని యోజన పటేల్ స్పష్టం చేశారు.