పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన సోదరి అలీమా ఖాన్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస పరాజయాల తరువాత, పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇమ్రాన్ తీవ్ర నిరాశ చెందారని ఆమె పేర్కొన్నారు. దేశంలో క్రికెట్ నాశనమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.
భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో పరాజయం పాలై, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తొలగించబడిన తొలి ఆతిథ్య జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి ఇమ్రాన్‌ను తీవ్రంగా కలిచివేసిందని అలీమా ఖాన్ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను వీక్షించారని తెలిపారు.
ఇక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాలనపైనా ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా, అనుభవం లేని వ్యక్తులను పదవుల్లో ఉంచడమే దేశ క్రికెట్ పతనానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వ్యవహారశైలిపై కూడా ఇమ్రాన్ ప్రశ్నించారని అలీమా చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ కారణంగానే పాక్ క్రికెట్ పతనమైందని, ఆయన పాలన సమయంలో తీసుకున్న నిర్ణయాలే జట్టు నష్టానికి కారణమని మాజీ పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథి విమర్శించారు. ప్రస్తుత జట్టు నుంచి పాత గొప్ప ప్రదర్శనలు ఆశించలేమని ఆయన పేర్కొన్నారు. పాక్ జట్టు వరుస పరాజయాలతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.