ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ విన్యాసాలు చేపట్టారు. షాజహాన్‌పుర్ సమీపంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేకంగా నిర్మించిన 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ వద్ద ఈ కసరత్తు కొనసాగింది.
ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం, యుద్ధ సమయాల్లో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ బేస్‌లు అందుబాటులో లేనప్పుడు ఎక్స్‌ప్రెస్‌వేలను ప్రత్యామ్నాయ రన్‌వేలుగా ఉపయోగించేందుకు ఉన్న సామర్థ్యాన్ని పరీక్షించడమే. ఇందులో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సమయాల్లో రఫెల్, సుకోయ్-30ఎంకేఐ, మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలతో పాటు సీ-130జే, ఎంఐ-17 వీ5 వంటి ట్రాన్సుపోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా విన్యాసాలు చేశారు.
ఈ ప్రయోగానికి నేపథ్యంగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బలమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎయిర్ స్ట్రిప్ చుట్టూ సుమారు 250 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగించారు. ట్రయల్స్ ముందు నుంచే వైమానిక దళం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా ప్రభుత్వం, వైమానిక దళం సమన్వయంతో ముందంజ వేసింది.
ఇదివరకు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేల్లోనూ ఇలాంటి ఎయిర్ స్ట్రిప్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు గంగా ఎక్స్‌ప్రెస్ వే కూడా ఈ జాబితాలో చేరింది. ఈ విన్యాసాల ద్వారా దేశ రక్షణ రంగానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరీక్షించడంతో పాటు, ఎక్స్‌ప్రెస్‌వేలను బహుళ ప్రయోజనాలుగా వాడుకునే దిశగా ఐఏఎఫ్ కీలక అడుగులు వేసింది.
