అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని న్యాయస్థానం చరిత్రలో ఒక చారిత్రాత్మక తీర్పుగా బుధవారం రాత్రి వెలువడింది. దేవరపల్లి ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధించారు. ఈ కేసులో అత్యుత్తమంగా తమ సేవలందించిన అడ్వకేట్ ఉగ్గిన వెంకట రావు మరియు ASI అప్పల నాయుడుకు ఫోరం ఫర్ బెటర్ చోడవరం సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఫోరం వ్యవస్థాపకులు ఆర్క్ ప్రసాద్, బద్రి మహంతి వెంకట రావు నేతృత్వంలో ప్రేమ సమాజంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ తీర్పు ద్వారా నేటి సమాజానికి ధైర్యం, న్యాయ వ్యవస్థపై భరోసా కలిగిందని వక్తలు పేర్కొన్నారు. వేగంగా, కఠినంగా తీర్పులు రావాల్సిన అవసరాన్ని చర్చించారు. ముఖ్యంగా యువతలో మానసిక శుద్ధికి చర్యలు అవసరమని, తల్లిదండ్రులతో కలిసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వేదిక తెలిపింది. కఠినమైన శిక్షలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు.
అడ్వకేట్ వెంకట రావు మాట్లాడుతూ ఈ కేసు తనకు సవాల్‌గా ఉండటమే కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావించి అత్యంత నిబద్ధతతో పోరాటం చేశానని తెలిపారు. ప్రభుత్వ న్యాయమూర్తులు, పోలీసుల సహకారం, సాక్షుల ధైర్యం ఈ తీర్పుకి వెన్నెముకగా నిలిచాయని చెప్పారు. ఈ సంఘటన తమను కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పారు.
ఈ సందర్భంగా అనేక ప్రముఖులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. ASI అప్పలనాయుడుకి అనకాపల్లి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చోడవరం ప్రజలు, ఫోరం ఫర్ బెటర్ చోడవరం సభ్యులు ఈ తీర్పుని స్వాగతించి, న్యాయబద్ధంగా చట్టం పనిచేస్తోందని అభిప్రాయపడారు.