పర్వతాల్లో హైకింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం కొన్ని సార్లు ఊహించని అనుభవాలకు దారితీస్తుంది. చెక్ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో ఫిబ్రవరిలో ఇద్దరు హైకర్లు ప్రయాణిస్తున్నప్పుడు, వారు అనుకోకుండా శతాబ్దాల నాటి బంగారు నిధిని కనుగొన్నారు. ఇది దేశం ఉత్తరాన ఉన్న ఈశాన్య ప్రాంతంలో చోటు చేసుకుంది.
వారు హైక్ చేస్తూ నడుస్తుండగా కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దగ్గరగా వెళ్లి పరిశీలించగా, అక్కడ పాతకాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు బయటపడ్డాయి. వెంటనే వారు ఈ విషయాన్ని స్థానిక పురావస్తు అధికారులకు తెలియజేశారు. అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని మొత్తం 598 బంగారు నాణేలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నిధిని ప్రస్తుతం ఈస్ట్ బొహెమియన్ మ్యూజియంలో భద్రంగా ఉంచారు. నిపుణుల చెబుతున్న సమాచారం ప్రకారం ఈ నాణేలు 1808 నాటివిగా భావిస్తున్నారు. వీటిలో ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్యానికి చెందినవి ఉన్నట్లు గుర్తించారు. దీన్ని 1921 తర్వాత ఎవరైనా భద్రత కోసం భూమిలో దాచినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక అంచనా విలువ దాదాపు రూ. 2.87 కోట్లు (3,40,000 డాలర్లు).
చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం, ఇలాంటి పురాతన నిధిని కనుగొన్నవారికి దాని విలువలో 10 శాతం బహుమతిగా లభించే అవకాశం ఉంది. నాజీ శాసన కాలంలో భయంతో ప్రజలు ఈ రీతిలో విలువైన వస్తువులను భద్రపరచడం సాధారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంకా విశ్లేషణ జరగాల్సి ఉన్నప్పటికీ, ఇది దేశంలో వెలికితీసిన అరుదైన నిధుల్లో ఒకటిగా నిలుస్తుందని మ్యూజియం అధికారి పేర్కొన్నారు.