సత్యసాయి జిల్లా ధర్మవరంలో హెల్మెట్ అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ రత్న ప్రారంభించి, ప్రజలందరూ ద్విచక్రవాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. బైక్ ప్రయాణాల్లో హెల్మెట్ అవసరాన్ని గుర్తు చేస్తూ, కళాశాల బాలికలు కూడా హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ అవగాహనా ర్యాలీ పట్టణంలోని పోతుకుంట, కాలేజ్ సర్కిల్, పీఆర్టీ స్ట్రీట్, గాంధీనగర్ సహా వివిధ వీధుల్లో సాగింది. స్థానికులు ర్యాలీని ఆసక్తిగా వీక్షించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. యువత హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను రక్షించుకోవాలని అన్నారు.
డీఎస్పీ హేమంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడమే కాకుండా, ఇతరులను కూడా దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. అనేక ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని, ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.