తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు ప్రముఖ కథానాయిక అయిన హీరా, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలు కొన్ని నెలల క్రితం హీరా తన బ్లాగ్‌లో రాసిన ఓ పోస్ట్‌లో ఉన్నాయి. ఆ పోస్ట్ ఇప్పుడు అనూహ్యంగా వైరల్ అవడమే ఈ చర్చకు కారణమైంది. ఈ పోస్ట్ వెలుగులోకి వచ్చిన సమయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
హీరా తన బ్లాగ్‌లో ఈ ఏడాది జనవరిలో రాసిన ఒక పోస్ట్‌లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఆమె తెలిపిన విషయాల ప్రకారం, గతంలో తనకు ఒక తమిళ నటుడితో సహజీవనం చేయడం జరిగింది. ఆ నటుడికి వెన్నెముక సమస్య వచ్చినప్పుడు, ఆమె అతనికి ఆసుపత్రిలో సేవలు అందించిందని హీరా వివరించారు. అయితే, ఆ తర్వాత తనపై ‘డ్రగ్ ఎడిక్ట్’ అనే అబద్ధపు ఆరోపణలు వేసి, అతను తనను దూరం పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, హీరా తన బ్లాగ్ పోస్ట్‌లో ఆ నటుడు, తనతో విడిపోయిన తర్వాత తన సహనటిని వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. అజిత్, హీరా కలిసి 1996లో ‘కాదల్ కొట్టై’ చిత్రంలో నటించారు, ఆ చిత్రం విజయవంతమైన తరువాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అజిత్ 1999లో ‘అమర్కాలం’ చిత్రంలో నటించిన షాలినిని 2000లో వివాహం చేసుకున్నారు. హీరా బ్లాగ్ పోస్ట్‌లో ఈ అంశాలు వెల్లడించినప్పటికీ, ఆమె నేరుగా అజిత్ పేరును ప్రస్తావించలేదు.
హీరా పోస్ట్ పెడుతున్నప్పుడు, పెద్దగా ఎవరూ దానిని పట్టించుకోలేదు. కానీ, అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సమయంలో ఈ పోస్ట్ వైరల్ అవడం, అజిత్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. అజిత్ అభిమానులు ఈ పోస్ట్‌ను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రకటన ఒక కుట్ర అనిపిస్తోంది, దీని వెనుక ప్రత్యర్థి హీరో విజయ్ అభిమానుల ప్రమేయం ఉండొచ్చని వారి అభిప్రాయం.