బి కోడూరు మండలంలోని మునెల్లి పరిసర గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ప్రధానంగా సాగు చేస్తున్న పొగాకు పంట తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న పంటలు నీటిలో మునిగి నాశనం కావడంతో రైతులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు.
గత ఏడాది జిపిఎస్ పొగాకు కంపెనీ యాజమాన్యం గ్రామాల వారీగా తిరిగి ప్రతి ఒక్క రైతును అర్ధ ఎకరా పొగాకు సాగు చేయమని ఉత్సాహపరిచారు. ఆదాయం రెట్టింపు అవుతుందంటూ హామీలిచ్చారు. దీంతో ఈ ఏడాది మునెల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు.
చెరువులు లేకుండా జీవిస్తున్న ఎంతోమంది రైతులు పొలాలను కౌలుకు తీసుకొని ఈ పొగాకు సాగులో నిమగ్నమయ్యారు. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడితో రైతులు పంట సాగు చేయగా, అకాల వర్షంతో పంట నష్టానికి గురైంది. కోట్లలో నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
ఈ నష్టాన్ని గమనించి, జిపిఎస్ కంపెనీ యాజమాన్యం స్పందించకపోతే తమకు ఇక దారి లేదని, ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.