చిత్తూరు జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు గారి పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, జడ్జి శ్రీమతి ఉమా దేవి గారు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1,30,000 జరిమానా విధించారు.
జిల్లా ఎస్పీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఐపీఎస్ గారి ఆదేశాలతో చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత 12 నెలల్లో 690 మందికి సుమారు రూ.69 లక్షల జరిమానా విధించబడింది. రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే మరింత కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
సెక్షన్ 185 ప్రకారం, మద్యం తాగి వాహనం నడిపిన తొలిసారి రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. రెండోసారి నేరం చేస్తే రూ.15,000 జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రజలు ఈ నియమాలను గౌరవించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
“ప్రతి గమ్యం ముఖ్యం, ప్రతి జీవితం అమూల్యం” అని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు అన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని, ఇది మీకే కాకుండా ఇతర ప్రయాణీకులకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.