ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ రెవెన్యూ లోటుతో భారీ బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. రూ. 3.22 లక్షల కోట్లతో ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ రూపొందించారని, ఇది ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ఉందని పేర్కొన్నారు.
జీవీ రెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ, తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు. తక్కువ కాలంలోనే టీడీపీ ప్రభుత్వంలో గౌరవప్రదమైన పదవులు కల్పించారని, ఆ అవకాశాన్ని తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అని అన్నారు.
ఇటీవల జీవీ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించడం గమనార్హం.