కరీబియన్ దేశం హైతీలో విపరీత పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాంగ్ వార్ మరింత ముదురడంతో సోమవారం ఉదయం పోర్ట్ ఔ ప్రిన్స్ విమానాశ్రయంలో దిగుతున్న స్పిరిట్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానంపై దుండగులు కాల్పులు జరిపారు. భూమి నుంచి జరిపిన ఈ కాల్పుల కారణంగా విమానానికి పలుచోట్ల బుల్లెట్లు తగిలాయి, దాంతో పైలట్ అక్కడ ల్యాండ్ చేయకుండా విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు మళ్లించాడు.
దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో కాల్పుల అనంతరం విమానాన్ని పైకి లేపిన పైలట్, సురక్షితంగా డొమినికన్ రిపబ్లిక్‌లో ల్యాండ్ చేశాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినా, విమానంలో ఒక సిబ్బంది స్వల్ప గాయాలు పొందాడు. విమానం బయట పలుచోట్ల బుల్లెట్లు తగిలిన స్థానాలు కనిపించాయి.
ఈ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవడంతో హైతీలో గ్యాంగ్ హింసను ఎత్తిచూపిస్తున్నాయి. హైతీ పరిస్థితులు మరింత కష్టతరమవుతున్నాయని అధికారులు తెలియజేశారు.