నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి విచ్చేసి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు మంత్రులు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, ప్రస్తుత సమస్యలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
మంత్రి నివాసానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ తేజ హాజరయ్యారు. వీరు జిల్లాలో ఉన్న పలు ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.
నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అవసరమైన చర్యల గురించి నేతలు చర్చించారు. అదనపు రేషన్ సరఫరా, ధాన్యం కొనుగోలు, నూతన రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని, ప్రజలకు మరింత సౌలభ్యంగా అందించేందుకు కృషి చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సంగం, కోవూరు మండలాల్లో పర్యటించనున్నారు. అక్కడి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించి ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు.