రాష్ట్ర రవాణా శాఖామంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి శుక్రవారం విజయనగరం ఆర్.టి.సి డిపోలో 10 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో రెండు బస్సులు విజయనగరం-శ్రీకాకుళం మధ్య, మిగిలినవి అనకాపల్లి మరియు శ్రీకాకుళం డిపోలకుచెందినవిగా ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆర్.టి.సి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఈ.ఎస్.ఐ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి మంజూరు చేసిన నైట్ అవుట్ అలవెన్స్‌కు కార్మికులందరూ రుణపడి ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఆర్.టి.సి ఉద్యోగులు మరియు ప్రయాణీకులు రెండు కళ్లులాంటి వారు అని, వారికి ఏవైనా సమస్యలు ఎదురైనా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని అన్నారు. ప్రమాదాలు తగ్గించడంలో అందరూ కృషి చేసి ప్రయాణీకుల భద్రతను నిర్ధారించాలన్నారు.
ఉత్తమ సేవలందించిన డ్రైవర్లు మరియు కండక్టర్లను మంత్రి ప్రశంసా పత్రాలు, నగదు పారితోషికాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్.టి.సి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఎం.ఈ మరియు సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసన సభ్యులు అదితి గజపతిరాజు, ఆర్.టి.సి జోనల్ చైర్మన్ దున్ను దొర, ఆర్.టి.సి ఈ.డి విజయకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణ, డిప్యూటీ సి.పి.ఎం సుధా బిందు, ఆర్.టి.సి యూనియన్ ప్రతినిధులు, మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.